హనుమాన్ అంశ్.. గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సినిమా. కేవలం రెండు కోట్ల బడ్జెట్లో ఈ సినిమాను నిర్మిస్తే.. ఏకంగా 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఆధ్యాత్మిక చిత్రం. హనుమంతుడి భక్తుడైన కరోలి బాబా జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను చాలా సింపుల్గా తీశారు. ఇందులో గొప్ప ప్రొడక్షన్ వాల్యూస్ ఉండవు. పేరున్న నటీనటులుండరు. కానీ కరోలి బాబా జీవితాన్ని హృదయానికి హత్తుకునేలా చూపించారు. ఆ పాత్రలో శోభినవ్ సత్య అద్భుతంగా నటించాడు.
ఈ కథకు ఉత్తరాది ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిపోయారు. ఈ సినిమా థియేటర్లు దేవాలయాల్లా మారిపోయాయి. తొలి రోజు కేవలం రూ.10 లక్షల కలెక్షన్ రాబట్టిన ఈ సినిమా.. మౌత్ టాక్తో పుంజుకుని ఎవ్వరూ ఊహించని స్థాయిలో వసూళ్లు రాబట్టింది. విడుదలై రెండు నెలలు దాటినా ఇంకా హిందీలో బాగా ఆడుతోంది. ఈ సినిమాను గత వారాంతంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
హోంబలే ఫిలిమ్స్ తెలుగు పంపిణీ హక్కులు తీసుకోగా.. మైత్రి మూవీ మేకర్స్ సహా కొన్ని పేరున్న సంస్థల భాగస్వామ్యంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఐతే ఈ చిత్రం ఇక్కడ అనుకున్నంతగా ప్రభావం చూపించట్లేదు. తొలి రోజు ఒక మోస్తరుగా ఆక్యుపెన్సీలు కనిపించాయి కానీ.. తర్వాత పెద్దగా ప్రభావం లేదు. కామెడీ ఎంటర్టైనర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’కే మన ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు.
ఇది మంచి సినిమానే అయినా.. కరోలి బాబాతో మన వాళ్లకు పెద్దగా ఎమోషనల్ కనెక్షన్ లేకపోవడం.. సినిమా నెమ్మదిగా నడవడం.. కథ మరీ ఫ్లాట్గా సాగిపోవడం మన వాళ్లకు రుచించినట్లు లేదు. పైగా షిరిడి సాయిబాబా సినిమాను మళ్లీ చూసినట్లు ఉండడం కూడా దీనికి మైనస్ అయి ఉండొచ్చు. మొత్తానికి హిందీలో అద్భుతాలు చేస్తున్న ఈ సినిమా.. తెలుగు ప్రేక్షకుల దృష్టిని మాత్రం పెద్దగా ఆకర్షించలేకపోతోంది. పెద్ద నిర్మాణ సంస్థల హ్యాండ్ పడినా.. మంచి రిలీజ్ దక్కినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్ ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది