రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హీట్ పీక్స్‌కు చేరింది. ఒకవైపు నామినేషన్ల పర్వం జోరుగా సాగుతుంటే, మరోవైపు ప్రతిపక్ష వైసీపీ(YCP) అధినేత నుంచి సోషల్ మీడియా సైన్యాల వరకు ఒకే ఒక్క పల్లవి అందుకున్నాయి. "మావాళ్ళను నామినేషన్లు వేయకుండా కూటమి ప్రభుత్వం అడ్డుకుంటోంది, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది" అంటూ గొంతు చించుకుంటున్నాయి. హైకోర్టుల నుంచి సుప్రీంకోర్టుల వరకు పిటిషన్ల మోత మోగిస్తూ, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. మరి, ఈ ఆరోపణల్లో వాస్తవమెంత? క్షేత్రస్థాయిలో అసలు ఏం జరుగుతోంది? లెక్కలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.
రాజకీయాల్లో కొన్నిసార్లు ఓడిపోయినా గెలవడమనే ఒక ఆర్ట్ ఉంటుంది. ఇప్పుడు వైసీపీ ఆ వ్యూహాన్నే చాలా పక్కాగా అమలు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కావాలనే గందరగోళం సృష్టించి, తాము బాధితులమని కలరింగ్ ఇవ్వడం ద్వారా సింపతీ గేమ్ చేయాలని చూస్తోంది. శాంతిభద్రతలు క్షీణించాయంటూ జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించి, కూటమి సర్కార్‌ను ఇరుకున పెట్టడమే ఈ మాస్టర్ మైండ్ గేమ్ ఉద్దేశమన్నది సుస్పష్టం. ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోయినా.. "మేము పోటీ చేయలేకపోయాం కాబట్టే ఓడాం" అని కవర్ చేసుకోవడానికి, గెలిస్తే మాత్రం కూటమిని కోలుకోలేని దెబ్బకొట్టడానికి వైసీపీ ఈ రకమైన మైండ్ గేమ్‌కు తెరతీసింది. అయితే, జగన్(Jagan) అండ్ కో చేస్తున్న ప్రచారానికి, క్షేత్రస్థాయిలో దాఖలవుతున్న నామినేషన్ల సంఖ్యకు పొంతనే లేదు. ఎన్నికల బరిలో దిగి అధికార పార్టీని ఢీకొట్టేందుకు వాళ్లు వేస్తున్న నామినేషన్ల రికార్డులు చూస్తే అసలు బండారం బయటపడుతుంది.
రాష్ట్రంలోని 28 జిల్లాల లెక్కలు పరిశీలిస్తే:
ఎంపీటీసీల గోల: మొత్తం 9,829 ఎంపీటీసీ(MPTC) స్థానాలకు గాను ఏకంగా 51,902 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో ఒక్క వైసీపీ అభ్యర్థుల నుంచే పడిన నామినేషన్లు ఏకంగా 20,556. మిగిలిన పార్టీలైన టీడీపీ 2,013, జనసేన 4,609, బీజేపీ 1,150 చొప్పున నామినేషన్లు వేశాయి.
జడ్పీటీసీల జోరు: మొత్తం 659 జడ్పీటీసీ(ZPTC) స్థానాలకు 5,724 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక కేవలం ఒక్క చివరి రోజునే జడ్పీటీసీ స్థానాలకు 3,315, ఎంపీటీసీ స్థానాలకు 25,016 నామినేషన్లు పడ్డాయి. ఆఖరి రోజు జడ్పీటీసీలకు సంబంధించి టీడీపీ 2,078 నామినేషన్లు వేస్తే, వైసీపీ ఏకంగా 1,815 నామినేషన్లు దాఖలు చేసింది.
ఇన్ని వేల సంఖ్యలో నామినేషన్లు గుమ్మరించిన వైసీపీ.. బయట మాత్రం "మా వాళ్ళను నామినేషన్లే వేయనివ్వట్లేదు" అంటూ మొసలి కన్నీరు కార్చుతోంది. అయితే వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టడంలో, వాస్తవ గణాంకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో టీడీపీ(TDP), జనసేన, బీజేపీ కూటమి కొంత అలసత్వం ప్రదర్శిస్తోంది. ఒకవైపు వేల సంఖ్యలో తమ అభ్యర్థులతో నామినేషన్లు వేయిస్తూనే, మరోవైపు మీడియా ముందు మాత్రం తాము అణచివేయబడుతున్నామని డ్రామాలు ఆడటంలో జగన్ సక్సెస్ అవుతున్నారు. మొత్తానికి చూస్తే, అడ్డుకుంటున్నారంటూనే ఊరూవాడా వేల నామినేషన్లు వేయడం చూస్తుంటే.. వైసీపీ ప్లాన్ ఎంత డేంజరస్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ రాజకీయ వ్యూహ చతురతను కూటమి ఎలా తిప్పికొడుతుందో వేచి చూడాలి.