రాజకీయాల్లో శత్రువులు ఎప్పుడైనా మిత్రులు కావచ్చు, కానీ సొంత రక్తసంబంధాల మధ్య వచ్చే అగాధం పూడ్చడం అంత సులువు కాదని వైఎస్ కుటుంబ వివాహాలు నిరూపిస్తున్నాయి. తాజాగా బంధువైన వైఎస్ అనిల్ రెడ్డి(YS Anil Reddy) కుమార్తె వివాహానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన కుటుంబంతో కలిసి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అక్కడ ఇతర రాజకీయ ప్రముఖులతో కలిసి ఆయన సందడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలు బయటకు రాగానే ప్రజల్లో ఒకటే ప్రశ్న ట్రెండ్ అవుతోంది. బంధువుల పెళ్లిళ్లకే అంత ఆప్యాయంగా వెళ్లే జగన్.. మరీ త్వరలో జరగబోయే సొంత చెల్లెలి వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహానికి వస్తాడా? లేదా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
అన్నాచెల్లెళ్ల మధ్య ఆస్తి వివాదాలు, రాజకీయ దారులు వేర్వేరు కావడం జగమెరిగిన సత్యమే. అయితే ఈ విబేధాలు కేవలం రాజకీయా లకే పరిమితం కాకుండా కుటుంబ వేడుకల స్థాయికి దిగజారడం అభిమానులను కలచివేస్తోంది. బెంగళూరులోని యలహంక నివాసంలో కుమార్తె పెళ్లి చేయాలని షర్మిల భావిస్తే.. అక్కడ భద్రతా కారణాలంటూ అడ్డంకులు సృష్టించడం, చివరకు ఆ స్థలాన్ని ఇచ్చేందుకు కూడా జగన్ నిరాకరించారనే వార్తలు తీవ్ర చర్చకు దారితీశాయి. సొంత ఇంటిలో వివాహం చేయాలనే మేనకోడలి చిన్న కోరికను కూడా నెరవేర్చే అవకాశం లేకుండా పోవడంతో, షర్మిల(Sharmila) బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేయాల్సి వచ్చింది.
రాజకీయాలు, ఆస్తుల పంపకాలు ఎవరి లెక్కల ప్రకారం వారివి ఉండవచ్చు. కానీ పిల్లల శుభకార్యాలను కూడా ఈ తగాదాల్లోకి లాగడం ఎంతవరకు సమంజసం అని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. రక్తసంబంధాలు, కన్నపేమలను పక్కనపెట్టి కేవలం ఈగోలకే ప్రాధాన్యత ఇస్తే.. భవిష్యత్తులో వైఎస్ కుటుంబం(YS Family) ఎప్పటికీ ఒక్కటయ్యే అవకాశమే ఉండదని ఆ పార్టీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లికి వెళ్లిన ఘనతే షర్మిల కుమార్తె పెళ్లి విషయంలోనూ చూపించి, జగన్(Jagan) మనసు మార్చుకుని తన మేనకోడలిని ఆశీర్వదిస్తేనే వైఎస్సార్ ఆశయాలకు, కుటుంబ గౌరవానికి అసలైన అర్థం ఉంటుంది. మరి, రాజకీయ విబేధాల గోడలను బద్దలుకొట్టి జగన్ తన మేనకోడలి పెళ్లికి హాజరవుతారా? లేక ఈ దూరం మరింత పెరుగుతుందా? అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.