అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) ఆధ్వర్యంలో శాక్రమెంటోలోని కాలిఫోర్నియా స్టేట్ క్యాపిటల్ వెస్ట్ స్టెప్స్‌పై తొలిసారిగా దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ వేదికపై దీపావళి వేడుకలు జరిపి సరికొత్త చరిత్ర సృష్టించారు. చీకటిపై వెలుతురు సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ దీపావళి వేడుకల కోసం కాలిఫోర్నియా నలుమూలల నుంచి ఎన్నారైలు వేలాది సంఖ్యలో హాజరయ్యారు.
కాలిఫోర్నియాలోని భారతీయ-అమెరికన్ కమ్యూనిటీ నాయకులు, సాంస్కృతిక సంస్థలు మరియు కుటుంబాలు ఈ చిరస్మరణీయ వేడుకలో పాల్గొన్నారు.
అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) తో పాటు కాలిఫోర్నియా అసెంబ్లీ సభ్యులు యాష్ కాల్రా, డాక్టర్ దర్శన పటేల్, శాన్ డియాగోకు చెందిన FIA మరియు ఇతర కమ్యూనిటీ సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. కాలిఫోర్నియాలో భారతీయ వారసత్వం, సాంస్కృతిక వైవిధ్యం మరియు కమ్యూనిటీ ఐక్యతను ఈ కార్యక్రమం చాటిచెప్పింది. కాలిఫోర్నియా చరిత్రలో ఈ ఈవెంట్ ఒక కీలక మైలురాయిగా నిలిచిపోతుంది.
ఈ వేడుకలకు శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్, పలువురు కాలిఫోర్నియా అసెంబ్లీ సభ్యులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఉత్సవాల్లో భారతీయ సాంస్కృతిక ప్రదర్శనలు, భారతీయ సంప్రదాయ వంటకాలు, BAPS అందించిన అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీపావళి బాణాసంచా వెలుగులతో, విద్యుద్దీపాల అలంకరణ కాంతులతో కాలిఫోర్నియా స్టేట్ క్యాపిటల్ భవనం వెలిగిపోయింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ఆహూతులుకు ఇది ఒక మరపురాని అనుభూతి.
ఈ చరిత్రాత్మక వేడుకలో సిలికాన్ వ్యాలీ-శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా, శాన్ డియాగో, శాక్రమెంటో, స్టాక్‌టన్ మరియు పరిసర ప్రాంతాలతో నెవాడా నుండి కూడా ఎన్నారైలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వర్కింగ్ డే అయినప్పటికీ ఈ చరిత్రాత్మక వేడుక జరుపుకోవడానికి చాలా మంది ప్రతినిధులు చాలా దూరం నుంచి వచ్చారు.
"ఇది మొత్తం AIA కుటుంబానికి ఎంతో చారిత్రాత్మక మరియు చిరస్మరణీయ క్షణం! శాక్రమెంటోలోని కాలిఫోర్నియా స్టేట్ క్యాపిటల్‌లో జరిగిన మొట్టమొదటి దీపావళి వేడుకల్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు! అంతా కలిసి మనం కేవలం దీపావళిని మాత్రమే జరుపుకోలేదు; ఒక కొత్త చరిత్రను సృష్టించాం!" అని AIA ప్రతినిధి అన్నారు.
"కాలిఫోర్నియా స్టేట్ క్యాపిటల్ వెస్ట్ స్టెప్స్‌పై జరిగిన మొట్టమొదటి దీపావళి వేడుకల్లో మనం కూడా భాగమయ్యామని గర్వంగా చెప్పుకోవచ్చు! రాబోయే కొన్నేళ్లపాటు గుండెల్లో దాచుకునే క్షణం ఇది!" అని మరో ప్రతినిధి భావోద్వేగానికి లోనయ్యారు.
‘‘కాలిఫోర్నియా స్టేట్ క్యాపిటల్ వెస్ట్ స్టెప్స్‌పై జరిగిన ఈ మొట్టమొదటి దీపావళి వేడుక భారతీయ-అమెరికన్ సమాజానికి సాంస్కృతిక గర్వకారణం. ఐక్యత, కలుపుగోలుతనం మరియు కాలిఫోర్నియాలో భారతీయ వారసత్వానికి పెరుగుతున్న గుర్తింపునకు చిహ్నంగా ఒక గర్వించదగిన మైలురాయిగా ఈ వేడుక నిలిచిపోతుంది. ఇది రాబోయే తరాలకు ఖచ్చితంగా స్ఫూర్తినిస్తుంది.
మనమంతా కలిసి కేవలం దీపావళిని మాత్రమే జరుపుకోలేదు...ఒక కొత్త చరిత్రను సృష్టించాం!’’ అని ఏఐఏ ప్రతినిధి చెప్పారు.
ఈ చరిత్రాత్మక వేడుక ఘన విజయం సాధించడంలో సహకారం అందించిన అసెంబ్లీ సభ్యులు యాష్ కాల్రా, డాక్టర్ దర్శన్ పటేల్, కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్, పాల్గొన్న శాసనసభ్యులు, సహ-నిర్వాహక సంస్థలు, సాంస్కృతిక ప్రదర్శకులు, స్వచ్ఛంద సేవకులు మరియు కమ్యూనిటీ సభ్యులకు AIA తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.