ఒక అబద్ధం సృష్టించే అలజడి మనిషి జీవితాన్ని ఎంతలా కుదిపేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో అది మరీ ఘోరంగా ఉంటుంది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం ప్రముఖ నటి సుకన్య(Actress Sukanya)పై పడిన ఒక నింద, ఆమె వ్యక్తిగత ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసింది. అయితే, ఆలస్యమైనా న్యాయం గెలిచింది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిస్తూ సుకన్యకు భారీ ఊరటనిచ్చింది.
ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తే.. అది 1996వ సంవత్సరం. అప్పట్లో అడవులను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్(Veerappan)ను 'నక్కీరన్' పత్రిక ఎడిటర్ ఆర్.ఆర్. గోపాల్ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూను ప్రముఖ సన్ టీవీ నెట్‌వర్క్ ప్రసారం చేసింది. అయితే, ఆ సంభాషణలో వీరప్పన్.. నటి సుకన్యపై అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమారుడితో ఆమెకు అక్రమ సంబంధం ఉందంటూ నిరాధారమైన ఆరోపణలు గుప్పించాడు. ఎన్నికల ప్రచారంలో ఆమెకు సంబంధించిన కొన్ని వీడియోలను వాడుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
టీవీలో ప్రసారమైన ఈ వ్యాఖ్యలు అప్పట్లో టాలీవుడ్(Tollywood), కోలీవుడ్‌లో పెను తుఫాను సృష్టించాయి. ఊహించని ఈ పరిణామంతో సుకన్య తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు. సమాజంలో తన గౌరవానికి భంగం కలిగించేలా, ఎలాంటి ఆధారాలు లేకుండా చేసిన ఆ వ్యాఖ్యలపై ఆమె చట్టపరమైన యుద్ధానికి దిగారు. చానల్‌పై పరువు నష్టం దావా వేశారు. ఈ క్రమంలో 2015లో ట్రయల్ కోర్టు సుకన్యకు అనుకూలంగా తీర్పునిస్తూ.. రూ. 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని సన్ టీవీని ఆదేశించింది. కానీ, ఈ తీర్పును సవాల్ చేస్తూ సన్ టీవీ మేనేజ్‌మెంట్ హైకోర్టును ఆశ్రయించింది.
తాజాగా ఈ కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు(Madras High Court) ధర్మాసనం సన్ టీవీ వాదనలను పూర్తిగా తోసిపుచ్చింది. ఇంటర్వ్యూలో మాట్లాడింది వేరే వ్యక్తి అయినప్పటికీ.. ఒకరి పరువుకు నష్టం కలిగించేలా ఉన్న ఆ అభ్యంతరకర వ్యాఖ్యలను ఎడిట్ చేయకుండా అలాగే ప్రసారం చేయడం బ్రాడ్‌కాస్టర్ తప్పేనని కోర్టు స్పష్టం చేసింది. ప్రోగ్రామ్‌పై పూర్తి ఎడిటోరియల్ నియంత్రణ ఉన్నప్పుడు, ఆ కంటెంట్‌ను సరిచూసుకోవాల్సిన కనీస బాధ్యత ఛానల్‌కు ఉంటుందని జస్టిస్ కె. కుమరేశ్ బాబు తేల్చి చెప్పారు. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. సుకన్యకు రూ. 10 లక్షల నష్టపరిహారం చెల్లించాల్సిందేనని తుది తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో 80, 90వ దశకాల్లో సౌత్ ఇండియాను ఊపేసిన నటి సుకన్యకు దాదాపు 30 ఏళ్ల తర్వాత న్యాయం లభించినట్లయింది.