జెన్ జీ కిడ్స్...జెన్ ఆల్ఫా కిడ్స్..ఈ తరం పిల్లలు సూపర్ ఫాస్ట్..అల్ట్రా మోడర్న్! ఆ కుర్చీని మడతపెట్టి అంటూ హుషారుగా స్టెప్పులేస్తూ రీల్స్ చేసుకునే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. అయితే, ఈ తరం అమ్మాయిల్లో కుర్చీని మడతపెట్టకుండా కుదురుగా కూచిపూడి నాట్యం చేసే వాళ్లు కూడా ఉన్నారు. అందులోనూ అమెరికాలో ఉంటూ కూడా భారతీయ శాస్త్రీయ నృత్య రూపం కూచిపూడి నృత్య ప్రదర్శనలిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. అటువంటి వారిలో అమెరికాలోని ట్రావిస్ హైస్కూల్‌లో జూనియర్ అయిన విభ యడవల్లి ఒకరు.
16 ఏళ్ల వయసులోనే కూచిపూడి నృత్య ప్రదర్శనలతో విభ యడవల్లి ఎందరో దృష్టిని ఆకర్షించారు. ఏడేళ్ల వయసు నుంచి కూచిపూడి కళకు విభ అంకితమయ్యారు. కాలిఫోర్నియాలో శ్రీమతి లక్ష్మీ భవాని కొండూరు మార్గదర్శకత్వంలో విభ నృత్య ప్రయాణం ప్రారంభమైంది. ఆమె విభ తొలి గురువు. శాస్త్రీయ నృత్య రూపం కూచిపూడికి విభ కెరీర్ కు బలమైన పునాది పడింది ఇక్కడే. ఆ తర్వాత 2021లో విభ టెక్సాస్‌కు వచ్చిన తర్వాత శ్రీమతి రాజి రాయప్రోలు, పసుమర్తి వెంకటేశ్వర శర్మల శిష్యులరాలిగా కూచిపూడి శిక్షణను కొనసాగించారు. వీరి శిక్షణలో సాంకేతికత, కళాత్మకత వంటి విషయాలతోపాటు కూచిపూడిపై సంప్రదాయ అవగాహనను విభ మరింత మెరుగుపరుచుకున్నారు.
ఆస్టిన్ ప్రాంతంలో అనేక నృత్య నాటకాలు, రెసిటల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు కమ్యూనిటీ ప్రదర్శనలలో విభ పాల్గొని ప్రదర్శనలిచ్చారు. ప్రదర్శకురాలిగా మాత్రమే కాకుండా కథకురాలిగా కూడా విభ అభివృద్ధి చెందేందుకు, విభిన్న ప్రేక్షకులకు చేరువయ్యేందుకు ఈ ప్రదర్శనలు దోహదపడ్డాయి. కూచిపూడి పట్ల తనకున్న అంకితభావాన్ని ప్రతి ప్రదర్శనలో విభ చాటిచెబుతూ వేదిక ముందు ఉన్న ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తున్నారు.
అయితే, విభ కేవలం శాస్త్రీయ నృత్యం కూచిపూడికే పరిమితం కాలేదు. విభా తన హైస్కూల్ వర్సిటీ డాన్స్ టీమ్‌లో కూడా సభ్యురాలిగా ఉన్నారు. ఆ జట్టులో సభ్యురాలిగా ఉంటూ సమిష్టి కృషి, క్రమశిక్షణ, నాయకత్వం, నిబద్ధత వంటి లక్షణాలను విభ అభివృద్ధి చేసుకున్నారు. శాస్త్రీయ మరియు సమకాలీన నృత్యాలను విభ చక్కగా సమతుల్యం చేస్తున్నారు. దీని ద్వారా ఆమె తన కళాత్మక దృక్పథాన్ని సుసంపన్నం చేసుకొని కళలు, నృత్యం పట్ల ఆమె అభిరుచిని మరింత బలపరుచుకున్నారు.
తన కూచిపూడి నృత్య ప్రయాణంలో తల్లిదండ్రులు జ్యోత్స్న, శ్రీరామ్ యడవల్లి...గురువులు, కళాభిమానులు, మద్దతుదారులకు విభ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎన్నో సంవత్సరాల కఠోర శిక్షణ తర్వాత తాను కూచిపూడి డ్యాన్సర్ గా ప్రదర్శనలిస్తున్నానని, ఇది తనకు ఎంతో గౌరవాన్ని, సంతోషాన్ని ఇస్తోందని చెబుతున్నారు. కూచిపూడి నృత్యకారిణిగా భవిష్యత్తులో మరిన్ని ప్రదర్శనలు ఇచ్చి మరింత మంది ప్రేక్షకులకు చేరువవుతానని అంటున్నారు. ఆస్టిన్, టెక్సాస్‌లో వివా కుటుంబం నివసిస్తోంది. సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీ, ఆస్టిన్, టెక్సాస్‌లో జరిగిన తాజా ప్రదర్శనతోను విభజన ఎందరో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.