వైసీపీ అధినేత జగన్‌కు సీఎం చంద్రబాబు.. న్యూటన్ థర్డ్ లాను గుర్తు చేస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. గతంలో జగన్ ఎలా అయితే.. వ్యవహరించారో.. ఇప్పుడు అదే విధంగా చంద్రబాబు కూడా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. గతంలో చంద్రబాబుకు ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి జగన్‌కు ఏర్పడిందని చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరచర్చకు దారి తీసింది.
ఏంటీ థర్డ్ లా!
న్యూటన్ మూడవ చలన నియమం ప్రకారం "ప్రతి చర్యకు (Action) సమానమైన మరియు వ్యతిరేకమైన ప్రతిచర్య (Reaction) ఉంటుందిష. అంటే రెండు వస్తువులు పరస్పరం చర్య జరిపినప్పుడు, మొదటి వస్తువు రెండవ వస్తువుపై ప్రయోగించే బలం, రెండవ వస్తువు మొదటి వస్తువుపై ప్రయోగించే బలానికి సమానంగా, వ్యతిరేక దిశలో ఉంటుంది. ఇప్పుడు జగన్కు ఇదే ఎదురైందని రాజకీయ నేతలు చెబుతు న్నారు. రాజకీయాల్లో సరిగా వ్యవహరించకపోతే.. ఇలాంటి వి కామన్‌గానే ఎదురవుతాయని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
గతంలో ఏం జరిగింది..?
2019-24 మధ్య కాలంలో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ప్రజల మధ్యకువ చ్చారు. వైసీపీ సర్కారుపై నిరసన వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నారని ఆరోపిస్తూ.. ప్రజా ఉద్యమాలకు తెరదీశారు. నకిలీ మద్యం, ఇసుక, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్, చెత్తపై పన్ను వంటివాటికి వ్యతిరేకంగా ప్రజల మధ్యకు వచ్చారు. అలానే.. నిత్యావసర ధరల పెంపుదలను కూడా ప్రశ్నించారు. అదేవిధంగా తన పార్టీ నాయకులపై వైసీపీ నేతలు చేస్తున్న దాడులను కూడా ప్రశ్నించారు.
అయితే.. నాడు చంద్రబాబుకు రక్షణ కల్పించడంలో వైసీపీ వెనుకంజ వేసింది. ఫలితంగా నందిగామలో చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగింది. ఉండవల్లిలో ఏకంగా చంద్రబాబు నివాసంపై దాడి చేసేందుకు వైసీపీ నేత జోగి రమేష్ ప్రయత్నించారు. గుంటూరులో నిర్వహించిన సభకు భద్రతలేకుండా చేయడంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. కర్నూలులో అనుమతి ఇవ్వకపోవడంతో చిన్నపాటి స్టేడియంలో నే చంద్రబాబు నిరసనకు దిగారు. ఈ క్రమంలోనూ తొక్కిసలాట జరిగింది. దీంతో చంద్రబాబుకు భద్రతకల్పించాలని కోరుతూ.. టీడీపీ నేతలు కేంద్రానికి విన్నవించారు.
కట్ చేస్తే..
ఇప్పుడు అదే సూత్రం జగన్కు కూడా వర్తిస్తోందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. తాజాగా జగన్ ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఆరోపిస్తున్నారు. కావాలనే వైఎస్ జగన్‌కు భద్రత కల్పించడం లేదని ఆయన చెబుఉతన్నారు. జగన్‌కు భద్రతా లోపంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశామన్నారు. కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జగన్‌కు భద్రత కల్పించడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై జగన్ పోరాటం కొనసాగుతుందన్నారు. అయితే.. ఆయన కు భద్రత కల్పించకుండా కూటమి వ్యవహరిస్తోందన్నారు. అయితే.. గతాన్ని మరిచిపోతే.. ఎలా అంటూ.. టీడీపీ నాయకులు న్యూటన్ థర్డ్‌లాను గుర్తు చేస్తున్నారు.