గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్ డాక్టర్ రాజా నేతృత్వంలో సెంట్రల్ కమిటీ మీటింగ్!

admin
Published by Admin — August 16, 2026 in Nri
News Image

ప్రపంచవ్యాప్తంగా టీడీపీ బలోపేతం, సంస్థాగత విస్తరణ, ఎన్ఆర్ఐ నెట్‌వర్క్ బలోపేతం లక్ష్యంగా గ్లోబల్ ఎన్ఆర్ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజాను ఏపీ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. పార్టీ కోసం తెర వెనుక విశేష కృషి చేసిన డాక్టర్ రాజా సేవలను టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తించి ఆయనకు ఈ పదవి అప్పగించారు. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా టీడీపీ ఎన్ఆర్ఐ విభాగాలను సమన్వయం చేసి బలమైన గ్లోబల్ నెట్‌వర్క్‌ను నిర్మించే దిశగా ఆయన తొలి అడుగు వేశారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐ టీడీపీ సెంట్రల్ కమిటీ మీటింగ్ ను ఈ రోజు నిర్వహించారు. డాక్టర్ రాజా నిర్వహించిన ఈ తొలి జూమ్ మీటింగ్ కు 44 మంది సభ్యులు హాజరయ్యారు. తమను తాము పరిచయం చేసుకున్న తర్వాత మీటింగ్ ఎజెండా ప్రకారం వారు మాట్లాడారు. గ్లోబల్ కమిటీ ఏర్పాటు ఆవశ్యకతను డాక్టర్ రాజా వివరించారు. 2029 ఎన్నికల్లో టీడీపీ గెలుపే లక్ష్యంగా ఎన్ఆర్ఐలు ఏవిధంగా పని చేయాలి అన్న విషయంపై సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. గ్లోబల్ ఎన్నారై టీడీపీని మరింత బలోపేతం చేసి 2029 ఎన్నికల్లో పార్టీ విజయానికి కీలక శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సభ్యుల నుంచి సలహాలు స్వీకరించిన రాజా పలు అంశాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ క్రమశిక్షణ, ఎన్నారై టీడీపీ గ్లోబల్ కమిటీ విజన్ వంటి అంశాల గురించి ఆయన దాదాపు 45 నిమిషాల పాటు మాట్లాడారు. ఎన్నారై టీడీపీ విధివిధానాలు, ఎవరి పాత్ర ఏమిటి, ఎవరెవరి బాధ్యతలు ఎలా ఉంటాయి అన్న విషయాలను కూలంకషంగా తెలిపారు. తొలి త్రైమాసికంలో కార్యచరణ, ప్రాధాన్యతల గురించి ఆయన మాట్లాడారు. 

కొద్దిరోజుల క్రితం అమెరికాలో పర్యటించిన టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ తో డాక్టర్ రాజా చర్చించి సెప్టెంబర్ మొదటి వారంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరపాలని నిర్ణయించారు.

Tags
Global NRI TDP chief Doctor Raja Central committee meeting TDP national working president nara lokesh
Recent Comments
Leave a Comment

Related News

Latest News