టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఈరోజు 71వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలువురు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు...చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చిరంజీవి చేసిన సేవలు, ఆయన సాధించిన విజయాలను, రాజకీయవేత్తగా చిరంజీవి చేపట్టిన పదవులను, చేసిన సామాజిక కార్యక్రమాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు ఎక్స్ ఖాతాలో చంద్రబాబు పోస్ట్ పెట్టారు.
"ప్రముఖ చలనచిత్ర నటుడు, కేంద్ర మాజీ మంత్రి, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. 1978లో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఎనలేని కీర్తి ప్రతిష్టలను, ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని మెగాస్టార్‌గా నిలిచారు. రక్తనిధి, నేత్ర నిధి ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకుని సమాజం పట్ల తన బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, సినీ ప్రేక్షకులను మరింతగా అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని చంద్రబాబు ఆకాంక్షించారు.