భాషా భేదం లేకుండా ఏ భాష నుంచి ఏ మంచి సినిమా వచ్చినా ఆదరించే తెలుగు ప్రేక్షకుల మీద ఉన్నట్లుండి కొన్ని రోజుల నుంచి కన్నడిగులు విరుచుకుపడిపోతున్నారు. అందుక్కారణం.. కేజీఎఫ్ స్టార్ టాక్సిక్ మన వాళ్లకు నచ్చకపోవడమే. సినిమా ఓ మోస్తరుగా కూడా లేకపోవడం, పైగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అనువాద చిత్రానికి రేట్లు పెంచడంతో రిలీజ్ రోజు తెలుగు ప్రేక్షకుల ఫ్రస్టేషన్ మామూలుగా లేదు. దీంతో టాక్సిక్‌ను కొంచెం గట్టిగానే ట్రోల్ చేశారు.
ఐతే తెలుగులో ఇలా భారీ అంచనాలతో వచ్చిన సినిమా మరీ పేలవంగా ఉంటే.. అది ఎవరి చిత్రమైనా ఇలాంటి ట్రోలింగ్ తప్పదు. సంక్రాంతికి ప్రభాస్ మూవీ ది రాజాసాబ్ సైతం ఇలాంటి వ్యతిరేకతనే ఎదుర్కొంది. కానీ ఈ విషయం అర్థం కాని కన్నడిగులు.. టాక్సిక్‌ను కావాలనే టార్గెట్ చేస్తున్నారంటూ తెలుగు వాళ్ల మీద పడిపోతున్నారు. ఇకపై తెలుగు సినిమాలు చూడం అంటూ వార్నింగ్‌లు ఇస్తున్నారు. తెలుగు వాళ్ల అభిరుచిని ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు.
ఇదంతా ఒకెత్తయితే.. టాలీవుడ్ సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ ఎప్పుడో యథాలాపంగా చేసిన ఒక కామెంట్ పట్టుకుని ఇప్పుడు యశ్ ఫ్యాన్స్ వివాదం రాజేస్తుండడం గమనార్హం. తన ప్రొడక్షన్లో వచ్చిన కోటబొమ్మాళి పీఎస్ రిలీజ్ టైంలో జరిగిన ఒక ప్రెస్ మీట్లో అరవింద్ మాట్లాడుతూ.. ప్రేక్షకులు సినిమా బాగుంటే కొత్త హీరోనైనా ఆదరిస్తారని చెబుతూ, కేజీఎఫ్ కంటే ముందు యశ్ ఎవరు? తన గురించి ఎవరికైనా తెలుసా అని కామెంట్ చేశారు. ఇప్పుడు టాక్సిక్‌ను తెలుగు వాళ్లు టార్గెట్ చేయడానికి, ఆ కామెంట్‌కు లింక్ పెడుతూ.. యశ్‌ను మన వాళ్లు కించపరచడమే పనిగా పెట్టుకున్నారని కన్నడిగులు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.
చివరికి ఈ విషయం మీద యశ్ తల్లి పుష్ప కూడా స్పందించడం గమనార్హం. యశ్ కేజీఎఫ్ కంటే ముందు కన్నడలో పెద్ద స్టార్ అని.. అతను బ్యాగ్రౌండ్‌తో వచ్చిన హీరో కాదని, కష్టపడి ఎదిగాడని.. పెద్ద సినీ కుటుంబాల వాళ్లు ఇలాంటి సెల్ఫ్ మేడ్ స్టార్లను చూసి ఎందుకు భయపడతారని వ్యాఖ్యానించడం గమనార్హం.
ఐతే అరవింద్ ఏమీ యశ్‌ను చూసి భయపడలేదు. అతణ్ని కించపరచాలనీ చూడలేదు. యశ్ కన్నడలో అప్పటికి స్టార్ అయ్యుండొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో సహా ఇండియాలో మరెక్కడా ఫేమస్ కాదు. అయినా తన సినిమాను ఆదరించారనే పాజిటివ్ కోణంలో ఆయన కామెంట్ చేస్తే.. దాన్ని అప్పట్లో వివాదంగా మార్చారు. ఇప్పుడు మళ్లీ ఆ వివాదాన్ని రాజేసే ప్రయత్నం చేయడం విడ్డూరం. సామాన్య అభిమానులు దీనిపై గొడవ చేశారంటే ఓకే కానీ.. స్వయంగా యశ్ తల్లి కూడా ఇలా కామెంట్ చేయడమే ఆశ్చర్యం.