ఇండస్ట్రీలో స్టార్డమ్ సాధించాలనే కలతో అడుగుపెట్టే ఎంతోమంది నటీనటులు.. ఒక్కోసారి అనుకోని మానసిక ఒత్తిళ్లతో సతమతమవుతుంటారు. బయటకు గ్లామర్‌గా, సంతోషంగా కనిపించే సెలబ్రిటీల వెనుక ఎన్నో అంతర్గత పోరాటాలు ఉంటాయి. సరిగ్గా అలాంటి కఠిన పరిస్థితులే ఎదుర్కొన్నానని, ఒక దశలో నటనకు పూర్తిగా స్వస్తి చెప్పి హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్నానని టాలెంటెడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్(Actress Nivetha Pethuraj) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
‘మెంటల్ మదిలో(Mental Madhilo)’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ భామ, కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో తీవ్రమైన డిప్రెషన్, పానిక్ అటాక్స్ బారిన పడినట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాలు, కొన్ని తప్పుడు నిర్ణయాలు తన మానసిక స్థితిని పూర్తిగా దెబ్బతీశాయని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో పరిస్థితులు ఎంతగా దిగజారాయంటే, కెరీర్ ముగిసిపోయిందని భావించి ఒకవేళ ఇకపై అవకాశాలు రాకపోతే ఏకంగా హిమాలయాల బాట పట్టి ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ బతకాలని గట్టిగా నిర్ణయించుకున్నారట. అయితే కాలక్రమేణా పరిస్థితులు మళ్లీ సర్దుమమణగడంతో తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టానని ఆమె వెల్లడించారు.
కేవలం మానసిక ఒత్తిళ్లే కాకుండా, కెరీర్ ఆరంభంలో తన రూపం విషయంలోనూ నివేదా(Nivetha) తీవ్రమైన అభద్రతా భావానికి లోనయ్యారట. తన పెదవుల ఆకారం నచ్చక ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని ఆలోచించినట్లు ఆమె బాహాటంగానే ఒప్పుకున్నారు. అయితే కన్సల్టేషన్ కోసం వెళ్లిన వైద్యుడు ఆమెను తీవ్రంగా మందలించడంతో పాటు, భవిష్యత్తులో తలెత్తే అనారోగ్య సమస్యల గురించి హెచ్చరించడంతో ఆ ఆలోచనను విరమించుకున్నానని చెప్పారు.
ఈ సందర్భంగా సహజ సౌందర్యంతో ప్రేక్షకులను అలరిస్తున్న సాయి పల్లవి(Sai Pallavi), నిత్యామీనన్ వంటి నటీమణుల పేర్లను ఆమె ప్రస్తావించారు. వారిని చూశాకే తనలో ఉన్న అనవసరమైన భయాలు, ఆలోచనలు తొలగిపోయాయని, నేచురల్ బ్యూటీయే అసలైన అందమని గ్రహించినట్లు నివేదా స్పష్టం చేశారు. కష్టకాలాలన్నింటినీ దాటుకుని, ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంతో మళ్లీ బిజీ కావడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.