విజయవాడలో సీఎం చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పింది. ‘పేదల పట్టాల పండుగ’ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వినిపించింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. అయితే, సభా స్థలానికి దగ్గరలో ఉన్న సోడా గ్యాస్ సిలిండర్ పేలడంతోనే ఆ శబ్దం వచ్చిందని పోలీసులు నిర్ధారించారు. దీంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పేలుడు ధాటికి ఆ సిలిండర్ 60 మీటర్ల దూరంలో ఎగిరి పడింది. సమీపంలోని విద్యుత్ తీగలపై ఆ సిలిండర్ పడడంతో కాసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత చంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగించారు.
మాజీ సీఎం జగన్ కు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీలో అమరావతికి ఓకే చెప్పిన జగన్ ఆ తర్వాత మాట మార్చారని ఫైర్ అయ్యారు. ఇప్పుడు కూడా అమరావతిని అడ్డుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అయితే, అమరావతి జోలికి వస్తే అమరావతే వారి అంతు చూస్తుందని వార్నింగ్ ఇచ్చారు. గతంలో అమరావతిని అడ్డుకునేందుకు ప్రపంచ బ్యాంకుకు లేఖ రాసిన విషయాన్ని కూడా చంద్రబాబు గుర్తు చేశారు. ఇక అమరావతిలో చెరకు తోటలకు కూడా నిప్పు పెట్టి పైశాచిక ఆనందం పొందారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఏది ఏమైనా పేదలకు పట్టాలివ్వడం ధర్మమని, తాను ఇచ్చి తీరుతానని అన్నారు.
అమరావతి, విజయవాడ, గుంటూరు కలిసి అన్ స్టాపబుల్ సిటీగా రూపుదిద్దుకుంటుందని అన్నారు. అమరావతికి బుల్లెట్ ట్రైన్ వస్తుందని, విశాఖ నుంచి చెన్నైకి 4 లైన్ల రైల్వే లైన్లు కూడా వస్తాయని చెప్పారు. అమరావతికి ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డు వచ్చిన తర్వాత అనేక నగరాలతో అమరావతి అనుసంధానం అవుతుందని, అప్పుడు ఇక్కడ భూములకు రెక్కలు వస్తాయని తెలిపారు.