టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒకప్పుడు తన స్పీడ్‌తో దూసుకుపోయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) సినిమాల ప్యాటర్న్ పూర్తిగా మారిపోయింది. గతంలో ఏడాదికి రెండు సినిమాలు ఇచ్చిన హీరో, ఇప్పుడు ప్రతీ ప్రాజెక్ట్కూ ఏళ్ల తరబడి గ్యాప్ ఇస్తుండటం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్' చిత్రాలు ఒకే ఏడాదిలో వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఆ తర్వాత 'జై లవకుశ', 'అరవింద సమేత' కూడా వరుస సంవత్సరాల్లోనే సందడి చేశాయి. కానీ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన గ్లోబల్ ప్రాజెక్ట్ 'ఆర్ఆర్ఆర్' తర్వాత తారక్ సినిమాల లైనప్ పూర్తిగా మారిపోయింది.
సోలో హీరోగా ఆయన నుంచి సినిమా రావాలంటే ఇప్పుడు అభిమానులు సుదీర్ఘంగా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 'ఆర్ఆర్ఆర్(RRR)' తర్వాత సోలో హీరోగా 'దేవర' థియేటర్లలోకి రావడానికి ఏకంగా ఆరేళ్ల సమయం పట్టింది. అప్పట్లో ఈ భారీ గ్యాప్ గురించి స్వయంగా ఎన్టీఆరే మాట్లాడుతూ కొద్దిగా నర్వస్‌గా ఉందని తెలిపారు. ఇక 'దేవర' తర్వాత బాలీవుడ్ ఎంట్రీగా హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన 'వార్ 2' రూపంలో వైవిధ్యమైన ప్రాజెక్ట్ వచ్చినా, తెలుగులో ఆయన పూర్తి సోలో సినిమా కోసం మళ్లీ సుదీర్ఘంగా వెయిట్ చేయక తప్పడం లేదు.
ప్రస్తుతం మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న 'డ్రాగన్(Dragon)' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని 2027 జూన్ 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. 'దేవర' విడుదలైన సమయం నుంచి లెక్కగడితే.. మరో భారీ సోలో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి దాదాపు మూడేళ్ల సమయం పడుతోంది. ఒకప్పుడు క్రమం తప్పకుండా ఏడాదికో సినిమాతో అలరించిన స్టార్ హీరో, ఇప్పుడు ప్రతి సినిమాకూ ఇంత కాలం బ్రేక్ తీసుకోవడం ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది.
ఈ లాంగ్ గ్యాప్ ట్రెండ్ వెనుక ప్రధానంగా సినిమాల స్కేల్, పాన్ ఇండియా రేంజ్, భారీ బడ్జెట్ హంగులు కారణమవుతున్నాయి. ప్రశాంత్ నీల్(Prashanth Neel), కొరటాల శివ, అలాగే వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ప్రాజెక్ట్‌లు అన్నీ విజువల్ వండర్స్‌గా తెరకెక్కుతుండటంతో.. కేవలం షూటింగ్, వీఎఫ్ఎక్స్ వర్క్స్‌కే చాలా నెలల సమయం పడుతోంది. దీనికి తోడు దేశవ్యాప్తంగా నిర్వహించే గ్లోబల్ ప్రమోషన్స్ కూడా గ్యాప్ పెరగడానికి ఒక కారణం అవుతున్నాయి. మొత్తానికి చూస్తే, తారక్ నుంచి వచ్చే సినిమాల సంఖ్య తగ్గినప్పటికీ వాటి స్థాయి మాత్రం హాలీవుడ్ రేంజ్లో ఉంటోంది. రాబోయే కాలంలో కూడా ఇదే ప్యాటర్న్ కొనసాగే అవకాశం ఉండటంతో, ఇకపై ఏడాదికో సినిమా అనే ముచ్చట కష్టమేనని చెప్పాలి.