సుప్రీంకోర్టు ఉత్తర్వులు, ఆదేశాలపై.. ఇటీవల కాలంలో ప్రజాస్వామ్య వాదులు విమర్శలు చేస్తున్నారు. ఒకప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రశ్నించరాదని.. న్యాయమూర్తులను విమర్శించరాదని కొన్ని నియమాలు ఉండేవి. కానీ, దీనికి సంబంధించిన బారికేడ్లు కూడా ఇటీవల తొలిగిపోయాయి. న్యాయమూర్తులే చెప్పినట్టు.. న్యాయస్థానాలు సైతం.. విమర్శలకు, సూచనలకు, సలహాలకు అతీతమేమీ కాదు. ఢిల్లీలో అసలు కుక్కలే కనిపించరాదని.. దీనిని ఎవరైనా సవాల్ చేస్తే.. 50 లక్షల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించినప్పుడే.. ప్రజాస్వామ్య వాదులు ముందుకు కదిలారు. ఫలితంగా సదరు తీర్పునకు ఎన్నో సవరణలు వచ్చాయి.
సో.. సుప్రీంకోర్టే అయినా.. కొన్ని పరిమితులు.. పద్ధతులకు లోబడకపోతే.. విమర్శల చట్రంలో ఎదురు ప్రశ్నలకు సమాధానాలు చెప్పకతప్పదు. తాజా విషయానికి వస్తే.. మహిళలపై జరుగుతున్న అత్యాచార కేసుల్లో పోలీసులు `అత్యంత` కఠినంగా వ్యవహరించాలని.. అవసరమైతే.. తుపాకులు సైతం వినియోగించి.. నేరస్తుల గుండెళ్లో `భయం` పుట్టించేలా వ్యవహరించాలని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. యువతులపై జరుగుతున్న అత్యాచార కేసులను తీవ్రంగా భావిస్తున్నామని.. ఢిల్లీలో జరిగిన ఓ ఘటనకు సంబంధించి వ్యాఖ్యానించింది.
మంచిదే!. పోలీసులు ఇలాంటికేసుల్లో అలానే వ్యవహరించాలని అందరూ కోరుకుంటారు. కానీ, తుపాకులకు పనిచెప్పాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం.. అదేసమయంలో రేప్ కేసులో పక్కా ఆధారాలు చూపి అరెస్టు చేసి.. విచారణ చేస్తున్న వారికి.. బెయిల్ మంజూరు చేయడం.. వారంతా(నిందితులు) ఈ దేశ పౌరులేనని..ఇటీవల ఓ కేసులో కోర్టు వ్యాఖ్యానించడం వంటివి ఇప్పుడు తెరమీదికి వచ్చాయి. మరి న్యాయస్థానాలు ఇలా చేయొచ్చా? అంటూ.. మేధావులు నిప్పులు చెరుగుతున్నారు. అదేసమయంలో కేంద్రం తీసుకువచ్చిన `దిశ` చట్టం ప్రకారం.. నిర్దేశిత వ్యవధిలో(అంటే.. గరిష్ఠంగా 6 నెలలు) రేప్ కేసులో నిందితులను విచారించి దోషులకు శిక్ష విధించాలి. కానీ, న్యాయస్థానాలు అలా చేస్తున్నాయా? అనే మౌలిక ప్రశ్నలు కూడా తెరమీదికి వచ్చాయి.
కొన్ని ఉదాహరణలు చూద్దాం..
1) ఆశారాం బాపు: జోధ్‌పూర్ ఆశ్రమంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఈయనకు కోర్టు జీవిత ఖైదు విధించింది. కానీ.. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఇప్పటికీ బయటే ఉన్నారు. ఫలితంగా.. తాము ఏం చేసినా.. కోర్టులు బెయిల్ ఇస్తాయన్న భరోసా రేప్ కేసులో నిందితులకు అస్త్రంగా మారింది.
2) కరీం మొరానీ: బాలీవుడ్ ప్రొడ్యూసర్. ఈయనపై ఒక వర్ధమాన నటి ఆరు నెలల పాటు తీవ్రమైన అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులు ఈయనకు బెయిల్ ఇచ్చేశాయి. చిత్రం ఏంటంటే.. సుప్రీంకోర్టు కూడా బెయిల్‌ను సమర్థించింది. పైగా ఆయనకు రక్షణ కల్పించింది.
3) బిల్‌కిస్ బానో: 2002 గుజరాత్ లో బిల్‌కిస్ బానోపై గ్యాంగ్ రేప్ జరిగింది. అంతేకాదు.. ఆమె కుటుంబ సభ్యులను కూడా చంపేశారు. ఈ హత్య కేసులో 11 మందికి జీవిత ఖైదు పడింది. చిత్రం ఏంటంటే.. వీరికి గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేసింది. సుదీర్ఘ విచారణ తర్వాత.. సుప్రీంకోర్టు ఇటీవల వారిని తిరిగి జైలుకు పంపించింది.
4) కుల్దీప్ సింగ్ సెంగార్: 2017లో జరిగిన ఉన్నావో అత్యాచార కేసులో మాజీ బీజేపీ ఎమ్మెల్యే అయిన ఈయన ప్రధాన దోషి. శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఢిల్లీ హైకోర్టు ఈయనకు బెయిల్ ఇచ్చేసి.. అసలు శిక్షనే రద్దు చేసింది.
5) డేరా బాబా: డేరా సచా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (డేరా బాబా) 2002లో ఇద్దరు మహిళా అనుచరులపై కొన్నాళ్లపాటు అత్యాచారం చేసిన ఘటన దేశాన్ని కుదిపేసింది. 2017లో దోషిగా తేలాడు. దీంతో పంచ్‌కులలోని ప్రత్యేక సీబీఐ కోర్టు బాబాకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. కానీ, ఆయన ఇప్పటికి 150 సార్లు పెరోల్‌పై బయటకు వచ్చారు. ఇది ఇచ్చింది కూడా కోర్టులే. అంతేకాదు.. ఈయన బీజేపీ తరఫున గత 2024 పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. నిధులు కూడా సమకూర్చారన్న ఆరోపణలు వున్నాయి.
లోపం ఎక్కడుంది?
వాస్తవానికి రేప్ కేసుల్లో పోలీసుల విచారణలో ప్రాధమిక లోపాలు ఉంటున్నాయని చెబుతున్న సుప్రీంకోర్టు.. దోషులకు శిక్షలు వేయడంలో సుదీర్ఘ సమయం తీసుకోవడం.. తర్వాత.. వారికి బెయిల్ ఇవ్వడం.. జైళ్లలోనూ అధునాతన వసతులు కల్పించడం.. వంటివి నేరస్తులకు వరాలుగా మారుతున్నాయని.. గతంలోనే పెద్ద నివేదిక వచ్చింది. సో.. వ్యవస్థల్లోనే తప్పులు పెట్టుకుని.. ఇప్పుడు తుపాకులు పట్టుకోవాలని సుప్రీం కోర్టు చెప్పడం పట్ల మేధావులు విస్తు బోతున్నారు.