తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంచార్జ్‌.. ఎవ‌రీ బిఎం సందీప్

admin
Published by Admin — November 14, 2026 in Politics, Telangana
News Image

రాహుల్ గాంధీ(Rahul Gandhi) తెలంగాణ పర్యటన వేళ కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన మీనాక్షి నటరాజన్ స్థానంలో కర్ణాటకకు చెందిన సీనియర్ నాయకుడు బి.ఎం. సందీప్ కుమార్‌ను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. గత కొంతకాలంగా పార్టీలో నెలకొన్న స్తబ్దతను తొలగించి, సంస్థాగతంగా కొత్త ఊపు తీసుకురావాలనే ఉద్దేశంతోనే హైకమాండ్ ఈ ఆకస్మిక మార్పునకు శ్రీకారం చుట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) ఉన్నత విద్యా కోర్సు నిమిత్తం విదేశాలకు వెళ్లడంతో, రాష్ట్ర పార్టీ వ్యవహారాలను పూర్తిస్థాయిలో పర్యవేక్షించే నాయకత్వం లేకుండా పోయిందనే అభిప్రాయాలు వినిపించాయి. ఇదే సమయంలో రాష్ట్ర మంత్రులు, సీనియర్ నేతల మధ్య సమన్వయ లోపం తలెత్తడం, నామినేటెడ్ పదవుల భర్తీ ఆలస్యం కావడం వంటి అంశాలు అధిష్టానం దృష్టికి వెళ్లాయి. ముఖ్యంగా కొందరు ఎమ్మెల్యేల బహిరంగ వ్యాఖ్యలు, ఒక మంత్రిపై వేటు పడే స్థాయికి పరిస్థితులు వెళ్లడంతో.. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య బలమైన సమన్వయకర్త అవసరమని ఏఐసీసీ భావించింది.

అయితే ఇప్పుడు అందరి దృష్టి నూతన ఇన్‌ఛార్జ్ బి.ఎం. సందీప్ కుమార్(BM Sandeep Kumar) పైనే పడింది. కర్ణాటకలోని చిక్కమగళూరు ప్రాంతానికి చెందిన సందీప్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సొంత రాష్ట్రానికి చెందిన నేత కావడం విశేషం. తెరవెనుక ఉంటూ పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే వ్యూహకర్తగా ఆయనకు పేరుంది. జాతీయ స్థాయిలో ఏఐసీసీ కార్యదర్శిగా పనిచేస్తూ మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ, సంస్థాగత వ్యవహారాలను సమర్థవంతంగా నడిపించిన అనుభవం ఆయన సొంతం.

తెలంగాణ రాజకీయాలు సందీప్‌కు కొత్తేమీ కాదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తెలంగాణ(Telangana) పీసీసీ కమిటీల కూర్పులో ఆయన కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలోని ముఖ్య నేతలందరితో సత్సంబంధాలు ఉండటం, అందరినీ కలుపుకుపోయే స్వభావం ఆయనకు కలిసివచ్చే అంశాలు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వానికి, టీపీసీసీ శ్రేణులకు మధ్య వారధిగా నిలుస్తూ.. అంతర్గత అసంతృప్తులను చల్లార్చి పార్టీని ముందుకు నడిపించడంలో సందీప్ ఏ మేరకు సఫలమవుతారో వేచి చూడాలి.

Tags
Meenakshi Natarajan Rahul Gandhi Telangana Congress Telangana News Congress CM Revanth Reddy TPCC
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News