తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సెటర్లు వేశారు. ``ఏమయ్యా సామీ.. నిన్ను ప్రజలు సీఎంను చేసింది.. నా గడ్డం గురించి మాట్లాడ్డానికా? అయినా.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమంటే నా గడ్డం గురించి మాట్లాడతావెందుకు.. నువ్వ అభివృద్ది చేయాలంటే నా గడ్డం నీకేం అడ్డమైంది?`` అంటూ వ్యాఖ్యానించారు. ఆదివారం వరంగల్ జిల్లా హనుమకొండలో పర్యటించిన కేటీఆర్.. సాయంత్రం స్థానిక డిగ్రీ కాలేజీ మైదానంలో నిర్వహించిన `జన చైతన్య` సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కార్నర్ చేసుకుని సెటైర్లు వేశారు.
రాష్ట్రంలో తిరిగి బీఆర్ ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. 2028లో జరిగే ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీదే ఘన విజయమని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజాపాలన జరగడం లేదని.. పర్సంటేజీల పాటన జరుగుతోందన్నారు. ``ఎందులో చూడు.. పర్సంటేజీలే. ఒక వెంచర్ వేస్తే దానిలో పర్సంటేజీలే. ఒక షాపు పెడితే కమీషన్లు. ఇది ప్రజాపాలన కాదు.పర్సంటేజీల పాలన. అందుకే ప్రజలు విసిగిపోయారు. కేసీఆర్ను కోరుకుంటున్నారు.`` అని వ్యాఖ్యానిం చారు. రేవంత్ రెడ్డిని ఒక్కసారికే భరించలేకపోతున్నామని తనకు ఫోన్లు వస్తున్నాయని చెప్పారు.
వరంగల్లే ఫ్యూచర్ సిటీ..
సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్న ఫ్యూచర్ సిటీ పైనా కేటీఆర్ సెటైర్లు వేశారు. ``ఆ ఫ్యూచర్‌సిటీకి ఫ్యూచర్ లేదు. పాడు లేదు`` అని వ్యాఖ్యానించారు. అది కేవలం కమీషన్ల కోసం తెచ్చిన ఫ్యూచర్ సిటీయేనని చెప్పారు. వాస్తవానికి వరంగల్లే ఫ్యూచర్ సిటీ అని వ్యాఖ్యానిం చారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయి ఉంటే.. వరంగల్ ఫ్యూచర్ సిటీగా ఇప్పటికే అభివృధ్ధి చెంది ఉండేదన్నారు. మరో 500 రోజుల్లో సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. ``కుదిరితేఇదే వరంగల్ గడ్డపై కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసేలా ఏర్పాట్లు చేస్తాం`` అని యువతకు హామీ ఇచ్చారు.
కేటీఆర్ సీఎం..
ఈ సందర్భంలో కొందరు యువత.. పెద్ద ఎత్తున `కేటీఆర్ సీఎం` అంటూ నినదించారు. దీనిని ఆయన సున్నితంగా తిప్పికొట్టారు. ఆ పదవిని చేపట్టేందుకు కేసీఆర్ అర్హులని.. ఆయన దూర దృష్టి, విజ్ఞానం, రాష్ట్రానికి ఎంతో అవసరమని, రాష్ట్ర ప్రజలకు ఎంతో చేయాలని కేసీఆర్ ఇప్పటికీ చెబుతున్నారని వ్యాఖ్యానించారు. యువత అంతా.. కేసీఆర్ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.