ఖాళీ చెక్కులతో 46 కోట్లు స్వాహ‌.. అక్కా-త‌మ్ముడిపై రాధ ఫిర్యాదు.!

admin
Published by Admin — September 21, 2026 in Movies
News Image

1980ల కాలంలో టాలీవుడ్, కోలీవుడ్‌(Kollywood)లను ఒక ఊపు ఊపిన అగ్రనటి రాధ వ్యక్తిగత జీవితంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తెరపై ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ కుటుంబంలో ఆస్తుల వివాదం తారాస్థాయికి చేరి, ఏకంగా పోలీసుల వరకు వెళ్లడం దక్షిణ చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది. తన సొంత అక్క, తమ్ముడే ఈ మోసానికి పాల్పడ్డారంటూ ఆమె చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో చేసిన ఫిర్యాదు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

వ్యాపార నిమిత్తం చెన్నై(Chennai)లోని ఐడీబీఐ బ్యాంకులో రాధా ఒక కరెంట్ ఖాతాను నిర్వహిస్తున్నారు. తరచూ విదేశాలు, ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తుండటం వల్ల.. సిబ్బంది జీతభత్యాలు, బిల్లుల చెల్లింపుల కోసం కొన్ని ఖాళీ చెక్కులపై ముందే సంతకాలు చేసి తన గదిలో భద్రపరుచుకునేవారు. అయితే, కాలక్రమేణా ఆమె కొత్త చెక్ బుక్‌కు మారడంతో, పాత ఖాళీ చెక్కుల విషయాన్ని పూర్తిగా విస్మరించారు.

ఈ క్రమంలో ఇటీవల బ్యాంకు నుంచి వచ్చిన ఒక ఫోన్ కాల్ ఆమెను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఏళ్ల క్రితం తను సంతకం చేసిన ఐదు ఖాళీ చెక్కులు, అక్క అంబికా పేరుతో బ్యాంకుకు సమర్పించి భారీ మొత్తాలు డ్రా చేయడానికి ప్రయత్నించారు. ఒక్కటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఐదు చెక్కుల ద్వారా సుమారు రూ. 46 కోట్లను అక్కా అంబిక‌(Ambika), సోదరుడు మల్లికార్జున కుంజన్ నాయర్ అలియాస్ అర్జున్ నాయర్‌ కలిసి స్వాహా చేయడానికి స్కెచ్ వేసినట్లు తేలింది. ఇందులో ఒక్కో చెక్కు విలువ కోట్లల్లో ఉండటం గమనార్హం.

ఈ నేప‌థ్యంలోనే వారిద్ద‌రిపై రాధా(Actress Radha) తన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేశారు. తాను ఇంట్లో లేని సమయంలో గదిలోకి ప్రవేశించి ఆ చెక్కులను దొంగిలించడమే కాకుండా, వాటిపై నంబర్లు, పేర్లు, భారీ మొత్తాలను తమకు అనుకూలంగా నింపుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం డబ్బుతో ఆగకుండా.. తన ఆస్తి వాటా, బంగారం, కీలక పత్రాలు ఉన్న ప్రాంతానికి వెళ్లకుండా కూడా తనను అడ్డుకుంటున్నారని పోలీసులకు తెలిపారు.

బ్యాంకు అధికారుల ద్వారా ఈ భారీ మోసం గురించి తెలుసుకున్న వెంటనే రాధా అప్రమత్తమై చెల్లింపులను నిలిపివేయాలని కోరారు. తనకు తన కుటుంబ సభ్యులతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం నటి రాధ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ సంచలన ఘటనపై అంబికా గానీ, మల్లికార్జున(Mallikarjuna) గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం.

Tags
Actress Radha Ambika South Cinema Kollywood News Cheque Scam Chennai Police
Recent Comments
Leave a Comment

Related News