సోషల్ మీడియా ఎంట్రీ తర్వాత అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారు తాము చెప్పాలనుకున్న విషయాన్ని ప్రజలకు ఇట్టే చెప్పేస్తున్నారు. గతంలో వారికి ప్రజలకు మధ్య మీడియా ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా ఆ స్థానాన్ని సొంతం చేసుకుంది. తాము చెప్పాలనుకున్న అంశాన్ని మీడియా ఎలా చెబుతుందన్న బెంగను సోషల్ మీడియా తీర్చేసింది. తాము చెప్పాలనుకున్న విషయాన్ని తమకు తామే నేరుగా చెప్పే సౌలభ్యాన్ని సోషల్ మీడియా తీసుకొచ్చింది. దీని వల్ల జరిగే మంచి మాత్రమే కాదు.. అప్పడప్పుడు షాకులు ఇచ్చే పరిస్థితి. ఇదిలా ఉండగా.. తాజాగా వరంగల్(Warangal) మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కొత్త ఎయిర్ పోర్టుకు పేరును సూచించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఎక్స్ వేదికగా కోరారు. దీనికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పందించారు. ఎక్స్ లో ఆయన తన స్పందనను తెలియజేస్తూ.. రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు (ఆర్ఐఏ), కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు (కేఐఏ) పేర్లను సూచిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. సందీప్ రెడ్డి వంగా వరంగల్ కు చెందిన వారు కావటం తెలిసిందే. తన సొంత ప్రాంతంలో ఎయిర్ పోర్టు ఏర్పాటు కానున్న అంశంపై ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. వరంగల్ చారిత్రక నేపథ్యాన్ని గుర్తు చేసేలా ఎయిర్ పోర్టు పేరు ఉండాలని కోరారు.
సందీప్ స్పందనకు సీఎం రేవంత్ రియాక్టు అయ్యారు. ఎయిర్ పోర్టుకు రెండు పేర్లు సూచన చేయటాన్ని ప్రస్తావిస్తూ.. దట్స్ ద స్పిరిట్ అంటూ రియాక్టు అయ్యారు. ప్రస్తుతం ప్రభాస్(Prabhas) తో సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ పేరుతో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి ప్రతిస్పందనలో స్పిరిట్ పదం రావటం పలువురిని ఆకర్షిస్తోంది. ప్రభాస్ అభిమానులను ఈ మాట మరింతగా ఆకర్షిస్తోంది. ఇక.. ఎయిర్ పోర్టు పనుల విషయానికి వస్తే.. మామూనూరు ఎయిర్ పోర్టు డెవలప్ మెంట్ పై తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో చర్చలు కొనసాగిస్తోంది.
ఈ నెల రెండున కేంద్రమంత్రిని కలిసి.. భూసేకరణ పూర్తి కావటమే కాదు.. సదరు భూమిని ఏఏఐకి అప్పగించినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు. టెండర్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేసి.. ఈ డిసెంబరులో ఎయిర్ పోర్టు పనులకు శంకుస్థాపన చేసేలా చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపినట్లుగా తెలంగాణ(Telangana) ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉండగా.. సందీప్ రెడ్డి వంగా సూచన చేసిన రెండు పేర్లు.. దానికి షార్ట్ నామ్స్ (ఎయిర్ పోర్టుల పేరును మూడు పదాల్లో కుదించి చెప్పటం మామూలే. టికెట్ల బుకింగ్ విషయంలోనూ.. ఇతన లాజిస్టిక్స్ లోనూ ఈ పదాలే కీలకంగా మారతాయి) ను కూడా సందీప్ సూచన చేయటం తెలిసిందే.
ఆయన సూచన చేసిన రెండు పేర్లకు.. ఆర్ఐఏ(RIA), కేఐఏ ఇప్పటికే ఆ పేర్లతో ఏమైనా ఎయిర్ పోర్టులు ఉన్నాయా? అని చూస్తే ఆసక్తికర సమాధానం లభిస్తుంది. ఆర్ఐఏ పేరు మీద రాబర్ట్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు.. శాంటా మరియా ఎయిర్ పోర్టులకు ఆర్ఐఏ పేరు ఉంది. ఇక.. కేఐఏ పేరుతో కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు.. కిలిమంజారో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులకు ఇవే పేర్లు ఉన్నాయి. అయితే.. ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి.
ఒక ఎయిర్ పోర్టు పేరును పొట్టి పేర్లతో పిలవటం మామూలే. అయితే.. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్టు అసోసియేషన్ మాత్రం ఒక ఎయిర్ పోర్టుకు ఇచ్చే మూడు అక్షరాల కోడ్ మరే ఎయిర్ పోర్టుకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వదు. కాకుంటే.. మామూలుగా పిలుచుకోవటం వరకు ఓకే కానీ.. టికెట్ బుకింగ్ లు మాత్రం వేర్వేరుగా ఉంటాయి. కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు కేఐఏ అనిపించినా.. బుకింగ్ విషయానికి వస్తే మాత్రం బీఎల్ఆర్ గా ఉంటుంది. దీనికి కారణం కెంపెగౌడ ఎయిర్ పోర్టుకు ముందే కిలిమంజారో ఎయిర్ పోర్టు అధికారిక కోడ్ కేఐఏ కావటంతో.. వేరే కోడ్ ను ఇస్తారు. ఒకవేళ సందీప్(Sandeep Reddy Vanga) సూచన చేసిన పేర్లలో దేన్ని ఓకే చేసినా.. పొట్టి పేరుగా ఆయన చెప్పినట్లే పిలిచినా.. అధికారిక టికెట్ల బుకింగ్ వేళ మాత్రం వేరే కోడ్ ఇవ్వటం ఖాయం.