ఉత్తరాంధ్ర జిల్లాల్లో టీడీపీకి బలమైన పట్టున్నా.. కొన్ని కొన్ని నియోజకవర్గాలు మాత్రం ఎదురు గాలిని ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అలాంటి వాటిలో ఒకటి కురుపాం. పూర్తిగా ఎస్టీ సామాజిక వర్గం బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భవించిన తర్వాత.. తొలిసారి 2024లో విజయం దక్కించుకుంది. తోయక జగదీశ్వరి(Thoyaka Jagadeeswari) గత ఎన్నిక ల్లో గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం అందుకునేందుకు ఆమె పెద్దగా దృష్టి పెట్టడం లేదు. పైగా.. కూటమి పార్టీలతోనూ కలివిడిగా ఉండడం లేదన్న వాదనా వినిపిస్తోంది.
ప్రధానంగా కూటమి సర్కారు అభివృద్ధి మంత్రంపై ఎమ్మెల్యే ఆశలు పెట్టుకున్నా.. క్షేత్రస్థాయిలో జనసేన(Janasena) పార్టీ బలంగా ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ నాయకులను, కార్యకర్తలను కూడా కలుపుకొని ముందుకు సాగాల్సిన అవసరాన్ని ఎమ్మెల్యే గుర్తించడం లేదని అంటున్నారు. దీంతో పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న కురుపాం నియోజకవర్గం రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా సాగుతున్నాయి. 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన ఈ స్థానంలో అప్పటి నుంచి కాంగ్రెస్.. తర్వాత వైసీపీలు వరుస విజయాలు దక్కించుకున్నాయి.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. కురుపాంలో టీడీపీ(TDP) తొలిసారి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. టీడీపీ తరపున పోటీ చేసిన తోయ్యక జగదేశ్వరి .. మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణిపై 23,500 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. అయితే.. వచ్చే ఎన్నికల్లోనూ ఇదే విజయం లభిస్తుందా? అంటే.. చెప్పడం కష్టమని.. ఆమె కూటమిని సమన్వయం చేసుకోవడంలో విఫలమవుతున్నారని అంటున్నారు. అయితే.. అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టారనేది ప్రస్తుతం వినిపిస్తున్న మాట.
మరోవైపు.. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావించిన పాముల పుష్పశ్రీవాణి(Pamula Pushpa Srivani)కి 2024 ఎన్నికల ఫలితాలు పెద్ద షాక్ ఇచ్చాయి. ప్రజా వ్యతిరేకత, కూటమి ఓట్ల బదిలీ ఆమె ఓటమికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ప్రస్తుతం నియోజకవర్గంలో పార్టీని తిరిగి బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. శత్రుచర్ల కుటుంబ వర్గ రాజకీయాలు కూడా కురుపాం నియోజకవర్గ రాజకీయాల్లో మొదటి నుంచీ ప్రభావం చూపుతున్నాయి. పుష్పశ్రీవాణి కూడా శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు కోడలిగా రాజకీయాల్లోకి వచ్చినా.. గత ఎన్నికలకు ముందు కుటుంబ వివాదాలు చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఆ వివాదాలు తగ్గించుకుని వచ్చే ఎన్నికల్లో విజయానికి పుష్ప శ్రీవాణి ప్రయత్నాలు ముమ్మరంగా చేసుకుంటున్నారు.