మంత్రిగా మార్కుల్లో ఫస్ట్. నేతగా స్థానిక రాజకీయాల్లో దూకుడు.. వెరసి శ్రీకాకుళం జిల్లా టెక్కలి(Tekkali) నియోజకవర్గంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు(Kinjarapu Atchannaidu)కు తిరుగులేదన్న టాక్ వినిపిస్తోంది. దీనికితోడు ప్రత్యర్థి పార్టీ వైసీపీ బలహీనంగా ఉండడం కూడా ఆయనకు భారీగా కలిసి వస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేస్తే.. తిరుగు లేదన్న వాదన వినిపిస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చెన్నాయుడు అప్పటి వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్‌పై 34,435 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.
అంతేకాదు.. వరుసగా మూడోసారి గెలుపు గుర్రం ఎక్కారు. కూటమి ప్రభుత్వం రావడంతో ఇక్కడ టీడీపీ(TDP) శ్రేణులు పూర్తి ఉత్సాహంతో ఉన్నాయి. ఇక, ప్రతిపక్షం (ప్రధాన కాదు) వైసీపీ పరిస్థితి.. దారుణంగా మారింది. దువ్వాడ శ్రీనివాస్ వైసీపీలోనే ఉన్నా.. ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నా.. ఆయన హవా పెద్దగా కనిపించడం లేదు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత, ఆయన కొన్ని వ్యక్తిగత, కుటుంబ వివాదాల వల్ల తరచూ వివాదాస్పదం అవుతున్నారు. ఇది పూర్తిగా దువ్వాడకు మైనస్ అయింది.
దీనికితోడు గ్రూపు తగాదాలు దువ్వాడకు భారీ మైనస్ అవుతున్నాయి. నియోజకవర్గ వైసీపీ(YCP)లో మొదటి నుంచీ దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్ మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పేరాడను తప్పించి.. పార్టీ పూర్తిగా దువ్వాడకు పగ్గాలు ఇచ్చింది. అయితే.. ఆయన దూకుడు పార్టీకి ప్రయోజనం కాకపోగా.. వ్యక్తిగతంగా కూడా విమర్శలు వచ్చేలా చేసింది. వచ్చే ఎన్నికల్లో దువ్వాడకు వైసీపీ టికెట్ ఇస్తుందా? ఇవ్వదా? అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.
వారసుడు ఎంట్రీ..
కింజరాపు అచ్చెన్నాయుడు తన నియోజకవర్గాన్ని మార్చే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాబోయే 2029 ఎన్నికల్లో టెక్కలి స్థానం నుండి తన కుమారుడు కింజరాపు మోహన్ నాయుడు((Kinjarapu Mohannaidu)ను బరిలోకి దించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా టెక్కలి మేజర్ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చడానికి మంత్రి అచ్చెన్నాయుడు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇది ఇక్కడి ప్రజల దశాబ్దాల కల. అలానే, వంశధార ప్రాజెక్టు నీటి విడుదల, సాగు-తాగునీటి ఇబ్బందులు, ఉద్దానం కిడ్నీ సమస్యల పరిష్కారం వంటివాటిని కూడా సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఇవన్నీ కొలిక్కి తెస్తే.. కింజరాపు కుటుంబానికి టెక్కలి కంచుకోటగా మారుతుందని అంటున్నారు.