ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయంలో మరోసారి సంచలనం మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా ప్రశాంతంగా ఉందనుకుంటున్న తరుణంలో, జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా పొలిటికల్ హీట్‌ను పెంచేశాయి. త్వరలో రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ఆంతరంగిక సమావేశంలో పవన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు టీడీపీ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర బాగు కోసం ఎన్నో త్యాగాలు చేశామని, మళ్లీ మళ్లీ త్యాగాలు చేయడానికి పార్టీ సిద్ధంగా లేదంటూ పవన్ కుండబద్దలు కొట్టడం కూటమి పెద్దలకు పెద్ద షాకే అని చెప్పాలి.
కూటమి నేత నారా లోకేష్(Nara Lokesh) ఓ వైపు "వచ్చే మూడే కాదు.. ఎప్పటికీ మన కూటమి ఐక్యంగానే పోటీ చేస్తుంది" అని ప్రకటనలు గుప్పిస్తుంటే, మరోవైపు పవన్ కల్యాణ్ మాత్రం దానికి భిన్నమైన వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. పొత్తు ధర్మం పాటిస్తూనే.. జనసేనకు బలం ఉన్న ప్రతి స్థానంలోనూ పోటీకి దిగుతామని ఆయన స్పష్టం చేశారు. కార్యకర్తలు, స్థానిక నేతల అభిప్రాయమే ఫైనల్ అని, పార్టీ బలోపేతమే తమ ప్రథమ ప్రాధాన్యమని చెప్పడం ద్వారా చంద్రబాబు నాయుడికి పవన్ ఒక పరోక్ష హెచ్చరిక పంపారనే చర్చ నడుస్తోంది.
సాధారణంగా స్థానిక ఎన్నికల్లో గ్రామ, మండల స్థాయిల్లో నాయకులకు పట్టు సాధించడం పార్టీ మనుగడకు చాలా కీలకం. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు కోసం తమ సీట్లను త్యాగం చేసిన జనసేన కేడర్.. ఇప్పుడు స్థానిక పోరులో కూడా టీడీపీ(TDP) కేటాయించే కొన్ని స్థానాలతో సరిపెట్టుకోవడానికి అసలు సిద్ధంగా లేదు. ఈ పరిస్థితిని ముందే గ్రహించిన పవన్ కల్యాణ్, క్యాడర్‌కు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. కేవలం కూటమి అని సర్దుకుపోతే క్షేత్రస్థాయిలో పార్టీ ఉనికికే ప్రమాదమని భావించి, బలం ఉన్న ప్రతి చోటా తొడగొట్టేందుకు సమాయత్తం కావలసిందిగా సంకేతాలిచ్చారు.
అయితే, ఒక వైపు పొత్తులో ఉంటూనే తమకు నచ్చిన స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామనడం పొత్తు ధర్మానికి ఏ మేరకు సాధ్యమనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నామమాత్రపు సీట్లతో సరిపెట్టుకోకుండా, తమకు దక్కాల్సిన సింహభాగం వాటాను చంద్రబాబు వద్ద గట్టిగా డిమాండ్ చేసి సాధించుకోవడానికే పవన్(Pawan Kalyan) ఈ రేంజ్ వ్యూహాన్ని రచించారా? లేక స్థానిక ఎన్నికల్లో జనసేన ఫ్రెండ్లీ కాంటెస్ట్ లేదా ఒంటరి పోరుకే మొగ్గు చూపుతోందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.