అరవ శ్రీధర్ కేసులో కొత్త ట్విస్ట్‌.. ప‌వ‌న్ పేరు తీస్తూ మహిళా ఉద్యోగి స‌వాల్!

admin
Published by Admin — February 03, 2026 in Politics, Andhra
News Image

రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు సంబంధించిన వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఈ కేసులో బాధితురాలిగా ఉన్న మహిళా ఉద్యోగి తాజాగా విడుదల చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. కేవలం తన వ్యక్తిగత విషయాన్ని కావాలనే రాజకీయ రంగు పులిమి, జనసేన పార్టీని, ముఖ్యంగా పవన్ కల్యాణ్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు కుట్ర పన్నారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.

తమ మధ్య ఉన్న వ్యక్తిగత వివాదాన్ని అడ్డం పెట్టుకుని కొందరు బ్రోకర్ రాజకీయాలు చేస్తున్నారని సదరు మహిళ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ఒక నీతివంతమైన నాయకుడని, ఆయన పేరును ఈ వివాదంలోకి లాగి బురదజల్లడం సరికాదని ఆమె స్పష్టం చేశారు. నా వ్యక్తిగత జీవితం ఇప్పటికే చిన్నాభిన్నమైంది. రాజకీయ లబ్ధి కోసం నా పరువును బజారున వేయకండి అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ జరిగితే అసలు నిజాలు బయటకు వస్తాయని, నిజాయితీ ఉంటే తన ఫోన్‌తో పాటు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఫోన్‌ను కూడా తనిఖీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

దమ్ముంటే నిరూపించండి.. బాధితురాలి సవాల్!
ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌తో తనకు ఉన్న వివాదం గురించి మాట్లాడే దమ్ము ఎవరికీ లేదని, అందుకే ఇతర అంశాలను తెరపైకి తెస్తున్నారని ఆమె విమర్శించారు. ఒకటిన్నర ఏళ్లుగా తమ మధ్య ఏం జరిగిందో తమకే తెలుసని, అందుకే ఎమ్మెల్యే ఇప్పటి వరకు నోరు మెదపడం లేదని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ``దమ్ము, ధైర్యం ఉంటే నేరుగా మా మధ్య జరిగిన విషయాలపై మాట్లాడండి.. ఆధారాలు ఉంటే బయటపెట్టండి.. అంతేకానీ పవన్ కల్యాణ్ గారి పేరు చెడగొట్టొద్దు`` అంటూ ఆమె సవాల్ విసిరింది.

అదేవిధంగా తాను పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. తన వద్ద ఉన్న ఒకే ఒక సెల్‌ఫోన్ నిరంతరం ఆన్‌లోనే ఉందని, యూపీఐ లావాదేవీలు కూడా జరుగుతున్నాయని వెల్లడించారు. తన ఆచూకీ తెలియదంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారు కావాలనే తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని ఆరోపించారు. కొందరికి డబ్బులు ఇచ్చి మరీ తనపై దుష్ప్రచారం చేయిస్తున్నారని, ఈ వ్యవహారం వెనుక తాతంశెట్టి నాగేంద్ర హస్తం ఉందని ఆమె నేరుగా ఆరోపణలు గుప్పించారు.

 

Tags
Arava Sridhar Janasena MLA Railway Koduru Pawan Kalyan Andhra Pradesh Ap Politics
Recent Comments
Leave a Comment

Related News