ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 16 వేల మంది ఉపాధ్యాయులను పక్కన పెట్టేయాలని.. గత ఏడాది నిర్వహించి న మెగా డీఎస్సీ -2025ను రద్దు చేయాలని వైసీపీ సోమవారం(సెప్టెంబరు 28) నుంచి రాష్ట్ర వ్యాప్త నిరసనలకు రెడీ అయింది. మొత్తంగా.. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేలా కనిపించడం లేదు. అయితే.. దీనిలో అసలు లోపాలే జరగలేదని.. ఏదైనా జరిగి ఉంటే హైకోర్టు ఇప్పటికే స్టే విధించేదని కూటమి ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటి కీ.. వైసీపీ మాత్రం దీనిని తెగే వరకు లాగాల్సిందే అన్నట్టుగా ముందుకు సాగుతోంది.
జంతర్ మంతర్ ప్లాన్!
నీట్ ప్రశ్నపత్రం లీకైన నేపథ్యంలో దీనికి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ఉద్య మం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అలాంటి ఉద్యమాన్నే ఏపీలోనూ చేపట్టాలని వైసీపీ నిర్ణయించుకు న్నట్టు తెలిసింది. తన శైలికి భిన్నంగా జగన్.. శుక్రవారం రాత్రి పార్టీ నాయకులతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. నిజానికి సాయంత్రం 6 తర్వాత..జగన్ రెస్టు తీసుకుంటారు. ఎలాంటి పనులు పెట్టుకోరు. అలాంటి ది డీఎస్సీ వ్యవహారంపైనా.. సోమవారం నుంచి నిర్వహించే నిరసనలపైనా ఆయన దిశానిర్దేశం చేశారు.
కాక్రోచ్ జనతా పార్టీ మాదిరిగా.. ఏపీలోనూ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని సృష్టించాలని నిర్ణయించారు. తద్వారా.. డీఎస్సీ -2025లో అవకతవకలు జరిగాయన్న విషయాన్ని మరింత బలంగా ప్రజలకు వివరించాలని జగన్ నిర్ణయించారు. ఇప్పటి వరకు చేపట్టిన ఉద్యమం సరిపోదని కూడా సెలవిచ్చారు. మొత్తంగా.. జగన్ లక్ష్యం ఒక్కటే కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో మంత్రి నారాలోకేష్‌ను రాజీనామా చేయించడం ద్వారా కూటమిని డిఫెన్సులో పడేయాలన్నది ఆయన లక్ష్యంగా ఉందని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
ఏం లాభం?
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 16 వేల మంది ఉపాధ్యాయులపై కత్తికట్టినట్టు పోరాటం చేస్తున్న జగన్‌కు వచ్చేది ఏమీ లేదు. కానీ.. రేపు వీరి ఉద్యోగాలు ఎఫెక్ట్ అయినా.. కాకపోయినా.. తమపై ఇంత పోరాటం చేసి వేధింపులకు గురి చేసిన వైసీపీని ఈ 16 వేల మంది టార్గెట్ చేయడం ఖాయం. ఒక్కొక్కరు 10 మందిని ప్రభావితం చేసినా.. దాదాపు లక్షల సంఖ్యలో ఓట్లు వైసీపీకి గల్లంతవుతాయి. సో.. ఈ విషయంలో వైసీపీ పునరాలోచన చేసుకోకపోతే.. గత ఎన్నికల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎలా అయితే.. వైసీపీకి రివర్స్ అయ్యారో.. ఇప్పుడు వీరు సైతం అదే బాట పట్టే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.