పులివెందులకు ఉపఎన్నిక.. జ‌గ‌న్ కు ఆర్ఆర్ఆర్ వార్నింగ్‌

News Image

వైసీపీ అధ్య‌క్షుడు, పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ను వార్న్ చేశారు ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు. జగన్ అసెంబ్లీకి రాకుంటే, పులివెందులకు ఉపఎన్నిక‌లు రావ‌డం ఖాయ‌మ‌న్నారు ఆర్ఆర్ఆర్. 2024 ఎన్నిక‌ల్లో కూట‌మి అఖండ మెజారీటీతో అధికారంలోకి వ‌చ్చింది. వైసీపీకి ప‌ట్టుమ‌ని పాతిక సీట్లు కూడా రాలేదు. 11 సీట్లే ద‌క్క‌డంతో ప్ర‌తిప‌క్ష హోదా ద‌క్క‌లేదు. అదే వంక‌గా చూపుతూ అసెంబ్లీకి రాకుండా ఎగ్గొడుతున్నారు జ‌గ‌న్‌. అయితే ఈ నెలలోనే బడ్జెట్ ప్రవేశ పెట్టాలని సీఎం చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈసారైనా జ‌గ‌న్ అసెంబ్లీలో అడుగుపెడ‌తారా? అంటే.. డౌటే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. తాజాగా ఇదే విష‌యంపై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు రియాక్ట్ అయ్యారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ అసెంబ్లీకి రావాల‌ని.. వ‌చ్చి తన మనోభావాలు చెప్పాల‌ని ఆర్ఆర్ఆర్ అన్నారు. ప్రతిపక్ష హోదా అనేది స్పీకరో, సీఎంనో ఇచ్చేది కాద‌ని.. ప్రజలు ఇవ్వాలని హిత‌వు ప‌లికారు. ఏ ఎమ్మెల్యే అయినా అర‌వై రోజులపాటు సెల‌వు అడగకుండా, స‌రైన కార‌ణం చెప్ప‌కుండా సభకు రాకుంటే అనర్హత వేటు పడుతుందని ఈ సంద‌ర్భంగా రఘురామకృష్ణరాజు గుర్తు చేశారు. జ‌గ‌న్ అసెంబ్లీకి రాకుంటే.. పులివెందులకు ఉప ఎన్నికలు వస్తాయని అన్నారు. మనస్ఫూర్తిగా జ‌గ‌న్ అసెంబ్లీకి రావాల‌ని తాను కోరుకుంటున్నాన‌ని ఆర్ఆర్ఆర్ చెప్పుకొచ్చారు. ఇక కస్టోడియల్ టార్చర్ కేసులో త‌న‌కు న్యాయం జ‌రుగుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌ని రఘురామకృష్ణరాజు అన్నారు. ఇది ప్ర‌జా ప్ర‌భుత్వమ‌ని.. ఈ ప్ర‌భుత్వంపై త‌న‌కు పూర్తి విశ్వాసం ఉంద‌ని.. బాధితుడిగానే ప్ర‌భుత్వానికి తాను ఫిర్యాదు చేశానని రఘురామ తెలిపారు. చాలా తెలివిగా పీవీ సునీల్ యూట్యూబ్‌లో ఉన్న వీడియోలు తీసేశారని.. కానీ దోషులకు క‌చ్చితంగా శిక్ష పడుతుందని.. అప్ప‌టి వ‌ర‌కు త‌న పోరాటం ఆగద‌ని ఆర్ఆర్ఆర్ స్ప‌ష్టం చేశారు.

Related News