తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సహా.. అప్పటి జలవనరుల మంత్రి హరీష్ రావును తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు. ఏపీకి నీళ్లను దోచిపెట్టారని.. తెలంగాణకు సంబంధించిన వాటాలను సరిగా అందిపుచ్చుకోలేదన్నది రేవంత్ రెడ్డి ప్రధాన ఆరోపణ. గతంలో జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించినా.. అదేవిధంగా పల్నాడు ప్రాజెక్టును చేపట్టినా అడ్డు చెప్పకపోగా.. ఇంటికి పిలిచి భోజనం పెట్టి మరీ ఆమోదం తెలిపారని.. దీంతో ఇప్పుడు తెలంగాణ రైతాంగం సహా.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రేవంత్ రెడ్డి చెబుతున్నారు.
ఇక, తాజాగా సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీకే చెందిన దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిని కూడా వదలకపోవడం గమనార్హం. వైఎస్ పాలనా కాలంలోనే తెలంగాణ నీటి హక్కులకు గండి పడిందని చెప్పుకొచ్చారు. వైఎస్ కారణంగానే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఏర్పడిందని.. తద్వారా.. తెలంగాణ నుంచి నీరు తరలించుకుపోయారని ఆయన ఆరోపించారు. ఇక, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ప్రాజెక్టు అంటే.. శ్రీశైలం ప్రాజెక్టు నుండి రాయలసీమ ప్రాంతాలకు సరఫరా చేసే నీటిని జలాశయం నుండి కాలువలోకి తీసుకునే నీటి నియంత్రణా వ్యవస్థ. నంద్యాల జిల్లా లోని పోతులపాడు అనే గ్రామం వద్ద దీనిని నిర్మించారు.
అయితే.. వైఎస్ హయాంలో ఆయా ప్రాజెక్టులపై సంతకాలు చేసింది, నిధులు సమీకరించింది కూడా హరీష్‌రావేనని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. నాడు హరీష్‌రావే జలవనరుల మంత్రిగా ఉన్నారని.. ఆయనే సంతకాలు చేశారని అన్నారు. ``వైఎస్ అంటే.. ఏపీ నాయకు డు. ఆయన నీళ్లు పట్టుకుపోయాడు. నువ్వేం చేశావ్. నువ్వు తెలంగాణ బిడ్డవు కదా. నీళ్లను దోచిపెట్టావ్`` అని విమర్శించారు. అంతేకా దు.. కేసీఆర్, హరీష్‌రావు ఇద్దరూ ఏపీకి తెలంగాణ జల వనరులను దోచిపెట్టారని ఆరోపించారు. ఇద్దరూ ద్రోహులేనని అన్నారు. వీరిని జాతి క్షమించదని చెప్పారు. జగన్ హయాంలో కేసీఆర్, వైఎస్ హయాంలో హరీష్‌రావు ఇద్దరూ ఏపీకి నీటిని తరలించేందుకు సహకరించారని చెప్పారు.
తెలంగాణ వాటా విషయంలోనూ కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు. ``కృష్ణా నది నుంచి మొత్తం 811 టీఎంసీలు రెండురాష్ట్రాలు పంచుకోవాలి. ఈ సమయంలో తెలంగాణకు 299 టీఎంసీలు చాలని కేసీఆర్ సంతకం చేశారు. దీంతో ఏపీకి 512 టీఎంసీలు దక్కాయి. ఇప్పుడు దీనిని మార్చేందుకు కూడా అవకాశం లేకుండా.. ఆనాడు సంతకాలు చేసి.. తెలంగాణ ప్రజలకు మరణ శాసనం రాశారు.`` అని రేవంత్ విరుచుకుపడ్డారు. అలాగే.. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కూడా జగన్‌కు అనుమతి ఇచ్చింది కేసీఆరేనని చెప్పారు. ఇన్ని చేసి.. ఇప్పుడు నీటి విషయంలో తెలంగాణ ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. కేసీఆర్-హరీష్‌రావు ఇద్దరూ దొంగలేనని అన్నారు. గతంలో వైఎస్ ను గురువుగా భావించిన హరీష్‌రావు.. అప్పట్లోనూ తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపించారు.