గన్నవరం రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక ఆసక్తికర పరిణామం జరుగుతూనే ఉంటుంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు తీవ్రమైన రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికీ, ఇప్పుడు ఆయన నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)తో భేటీ అయ్యేందుకు అపాయింట్‌మెంట్ కోరడం ఆసక్తికరంగా మారింది.
అయితే రైతుల సాగునీటి సమస్యల గురించి మాట్లాడేందుకే బాబు అపాయింట్‌మెంట్ కోరునట్లు ఆయన చెబుతున్నారు. కానీ, తెరవెనుక మాత్రం మళ్లీ తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యేందుకే వంశీ ప్రయత్నాలు సాగిస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. కానీ, వంశీ(Vallabhaneni Vamsi) వేస్తున్న ఈ అడుగులు ఆశించిన ఫలితాన్ని ఇస్తాయా లేదా అనేది మాత్రం ప్రశ్నార్థకమే. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరనే నానుడి ఎప్పటికీ వినిపిస్తుంటుంది. కానీ, వల్లభనేని వంశీ విషయంలో మాత్రం ఈ సూత్రం పనిచేయడం కష్టమనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. గతంలో టీడీపీ ద్వారానే రాజకీయంగా ఎదిగి, ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ గూటికి చేరిన ఆయన అనుసరించిన వైఖరి, ఆ సమయంలో చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం కేడర్‌లో తీవ్రమైన గాయాలనే మిగిల్చాయి. పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు కీలక నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఆయన చేసిన విమర్శలు పార్టీ శ్రేణుల్లో పూడ్చలేని ఆగ్రహాన్ని నింపాయి.
టీడీపీ(TDP) వర్గాల్లో వంశీ పేరు చెబితేనే రగిలిపోయే స్థాయికి నాటి పరిస్థితులు చేరాయి. భవిష్యత్తులో ఆయనతో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదనే సంకేతాలను అప్పట్లో కేడర్ బలంగా ఇచ్చింది. ఈ నేపథ్యంలో, ఇప్పుడు కేవలం రైతుల సమస్యలను నెపంగా లేదా ముసుగుగా పెట్టుకుని చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించినా, లేదా పార్టీలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నా.. టీడీపీ అధిష్టానం నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ లభించడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.