నిమిషానికి లక్షల్లో.. వర్షాకాల పార్లమెంట్ ఖర్చు తెలిస్తే షాకే..!

admin
Published by Admin — August 14, 2026 in Politics, National
News Image

ప్రజలు ఎంతో కష్టపడి కట్టే పన్నుల డబ్బుతో నడిచే అత్యున్నత చట్టసభల తీరు చూస్తుంటే సామాన్యుడి గుండె మండుతోంది. దేశ అత్యున్నత పంచాయతీ అయిన పార్లమెంటు(Parliament)లో ప్రజాసమస్యలపై గళం వినిపించాల్సిన ప్రజాప్రతినిధులు, కేవలం నినాదాలు, గందరగోళంతో కాలం వెళ్లదీస్తున్నారు. ఫలితంగా ప్రజాధనం నీళ్లలా ఖర్చవుతుండగా, సామాన్యుడికి ఒరిగేది మాత్రం శూన్యంగా మారుతోంది.

తాజాగా ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల(Parliament Monsoon Sessions) లెక్కలు చూస్తే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్ముతాయి. ఈ సెషన్ మొత్తం 19 రోజుల పాటు పని దినాలుగా సాగింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ పందొమ్మిది రోజుల్లో ఒక్కరోజూ కూడా సభ సజావుగా, ప్రశాంతంగా సాగలేదు. ఉదయం సభ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే అరుపులు, కేకలు, వాయిదాల పర్వం మొదలుకావడం రివాజుగా మారింది.

సాధారణ అంచనాల ప్రకారం, పార్లమెంట్ ఉభయసభల నిర్వహణకు రోజువారీ ఖర్చు అపారంగా ఉంటుంది. ఒక రోజు సభ నడవాలంటే దాదాపు రూ. 9 కోట్లు ఖర్చవుతుంది. అంటే నిమిషానికి రూ. 2.5 లక్షలు, గంటకు: రూ. 1.5 కోట్లు. ఈ లెక్కన మొత్తం 19 రోజులకు కలిపి కేవలం పార్లమెంట్ నిర్వహణ పేరుతో ప్రభుత్వ హుండీ నుంచి రూ. 200 కోట్లకు పైగా ప్రజాధనం ఖర్చయింది. ఇందులో ఎంపీల జీతభత్యాలు, విమాన ప్రయాణాలు, భద్రత, సిబ్బంది వేతనాలు, భారీ భవనాల నిర్వహణ ఖర్చులు అన్నీ కలిసి ఉంటాయి. సభ సజావుగా సాగి అర్ధవంతమైన చట్టాలు రూపుదిద్దుకుంటే ఈ ఖర్చును ఎవరూ తప్పుబట్టరు. కానీ, కేవలం నినాదాలతో సభను వాయిదా వేయించుకుంటూ పోతే.. ఆ వృథా అయిన ప్రతి నిమిషానికి లక్షలాది రూపాయల ప్రజాధనం(Public Money) బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.

అధికార, విపక్షాల మధ్య పట్టుదలలు, అహంభావాల పోరులో రోజువారీ రాజకీయ రసాభాస నడుస్తోంది తప్ప, ప్రజా సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని, అత్యవసర అంశాలపై సముచిత చర్చలు జరిపితే ఈ గందరగోళాన్ని తగ్గించవచ్చని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రజాస్వామ్య దేవాలయం అయిన పార్లమెంటులో నిమిషానికి లక్షలు తగలబడుతున్న ఈ తతంగంపై ఇప్పటికైనా నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం కాలక్షేపం రాజకీయాల కోసం కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును వృథా చేయడం సరికాదని ప్రజాస్వామ్య వాదులు మండిపడుతున్నారు.  

Tags
Parliament Sessions Tax Payers Public Money Indian Politics Parliament Public Funds Indian Democracy
Recent Comments
Leave a Comment

Related News