రాజకీయాల్లో ఉన్నప్పుడు చట్టాలు, నిబంధనలు అందరికీ వర్తిస్తాయని పెద్దపెద్ద మాటలు మాట్లాడటం మామూలే. కానీ, అధికారం పోయి, కనీస నిబంధనలు పాటించాల్సి వస్తేనే అసలు నైజం బయటపడుతుంది. తాజాగా కర్నూలు జిల్లా జైలులో వైఎస్‌ఆర్‌సీపీ(YSRCP) అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పర్యటనలో జరిగిన పరిణామాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. జైల్లో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్లిన జగన్.. అక్కడ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, తమను అవమానించారంటూ ఘాటు ఆరోపణలు చేయడం చర్చకు దారితీసింది.
అయితే, మాజీ ముఖ్యమంత్రిగా ఉండి కూడా జైలు నిబంధనల(Jail Rules)ను గౌరవించకుండా ఇలాంటి రచ్చ చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది. సాధారణ పౌరులైనా, సెలబ్రిటీలైనా, మాజీ సీఎంలైనా చట్టం ముందు అందరూ సమానులే అనే ఇన్‌స్టంట్ రూల్ ఇక్కడ ఎందుకు వర్తించకూడదు?
కర్నూలు(Kurnool) జిల్లా జైల్లో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు ఆయన తమ్ముడిని కలిసేందుకు జగన్ ములాఖత్‌కు వెళ్లారు. ‘ఈ-ప్రిజన్స్’ సాఫ్ట్‌వేర్ నిబంధనల ప్రకారం.. జైలులో ఎవరిని కలవాలన్నా, ఎంతమంది ముద్దాయిలను కలవాల్సి వస్తే అంతమందికి వేర్వేరుగా ఫొటో క్యాప్చర్ చేయడం తప్పనిసరి. ఈ రూల్ ప్రకారమే అధికారులు జగన్ ఫొటోను రెండుసార్లు తీసుకున్నారు.
కానీ, దీన్ని కూడా రాజకీయం చేస్తూ.. తన హోదాను కించపరిచేలా వ్యవహరించారంటూ జగన్(Jagan) హడావుడి చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులు వెళ్తే గంటల తరబడి క్యూలో నిలబడి, అన్ని నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తారు. మరి మాజీ సీఎం అయినంత మాత్రాన టెక్నాలజీ రూల్స్ తమకు వర్తించవని అనుకోవడం ఏంటి? అధికారుల పనిని తప్పుపట్టడం ద్వారా జగన్ ఏం సాధించాలనుకుంటున్నారు? ఎక్కడైనా, ఎప్పుడైనా నిబంధనలు పాటించడంలోనే గౌరవం ఉంటుంది. కానీ ప్రతి చిన్న దానికి హడావుడి చేసి, సానుభూతి పొందే ప్రయత్నం చేయడం మాజీ సీఎం స్థాయి వ్యక్తికి తగదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.